బంధువుల సూటిపోటి మాటలు భరించలేక కూతురు-అల్లుడిపై దాడిచేశా.. కుమార్తెను చూడాలని ఉంది: మనోహరాచారి

  • బంధువులు సూటిపోటి మాటలతో హింసించారు
  • బతిమాలినా కూతురు ఇంటికి రాలేదు
  • ఆ కసితోనే దాడి చేశా
  • చేసిన తప్పుకు బాధపడుతున్నా
బంధువుల సూటిపోటి మాటలు భరించలేకే కుమార్తె, అల్లుడిపై దాడిచేసినట్టు మనోహరాచారి పేర్కొన్నాడు. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంతో బంధువులు సూటిపోటి మాటలతో రెచ్చగొట్టారని, వారి మాటలతో కసి పెరిగి దాడి చేశానని పోలీసు విచారణలో మనోహరాచారి పేర్కొన్నాడు. తన కుమార్తెను చూడాలని ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్‌లపై సెప్టెంబరు 19న సాయంత్రం ఎర్రగడ్డలో మనోహరాచారి కత్తితో దాడి చేశాడు. బట్టలు పెడతానని నమ్మించి పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అల్లుడు స్వల్ప గాయాలతో తప్పించుకోగా, కుమార్తె మాధవి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఘటన అనంతరం పరారైన మనోహరాచారిని ఖైరతాబాద్‌లోని ఆయన బావమరిది ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, మూడు రోజుల పాటు విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు పలు విషయాలు వెల్లడించాడు. బంధువుల సూటిపోటి మాటలకు తోడు, బతిమాలినప్పటికీ కూతురు ఇంటికి రాలేదని, దీంతో తనలో మరింత కసి పెరిగిందన్నాడు. బంధువుల మాటలకు తోడు, మాధవిపై కోపంతోనే ఆమెను అంతమొందించాలని అనుకున్నానని చెప్పినట్టు తెలుస్తోంది. చేసిన తప్పుకు బాధపడుతున్నానని, ఆసుపత్రిలో ఉన్న కుమార్తెను చూడాలని ఉందని పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
Go Back to Shorts
Manoharachary
Erragadda
Hyderabad
Madhavi
sandeep

More Telugu News