అమృత వర్షిణి భర్త ప్రణయ్ హత్య కేసులో ఇంకా పట్టుబడని ఆ ఇద్దరూ ఎవరు?

  • ప్రణయ్ హత్యకు చేసిన ప్రయత్నం విఫలం
  • హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు!
  • వారు ఎవరన్న ప్రశ్నకు ఇంకా దొరకని సమాధానం
మిర్యాలగూడలో తీవ్ర కలకలం రేపిన పరువు హత్య వెనుక ఇంకా సమాధానం లభించని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ కేసులో అనుమానాలు పూర్తిగా నివృత్తికాకపోవడంతో విచారణ సక్రమంగా సాగిందా? అన్న చర్చ సాగుతోంది. ప్రణయ్ హత్యకు జరిగిన ప్లాన్ ను పోలీసులు వివరంగా చెప్పిన వేళ, అతనిపై అంతకుముందే హత్యాయత్నం జరుగగా, అది ఫెయిల్ అయిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

బ్యూటీ పార్లర్ కు వచ్చిన అమృతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని, ఆమె వెంట వచ్చే ప్రణయ్ ని హత్య చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారని పోలీసులు చెప్పారు. అయితే, ప్రణయ్ వెంట అతని సోదరుడు కూడా రావడంతో ప్రణయ్ ఎవరో తేల్చుకోలేక పోయారు. ఆ సమయంలో అమృతను కిడ్నాప్ చేసే పనిని తనకు అప్పగించారని, ప్రణయ్ ని హత్య చేసేందుకు మరో ఇద్దరు యువకులను తీసుకువచ్చారని బీహారీ కిల్లర్ సుభాష్ శర్మ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

దీంతో ఈ కేసులో  బ్యూటీపార్లర్‌ దగ్గర కాపు కాసిన యువకులు ఎవరు? అన్న ప్రశ్న తలెత్తింది. అరెస్టయిన వారిలో వీరిద్దరూ లేరు. హైదరాబాద్ నుంచి వచ్చిన వీరు మందు కొట్టి ఉండటంతో, సరిగ్గా పనిచేయలేరని అస్గర్ అలీయే వారిని తప్పించారని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హత్య చేసేందుకు వచ్చిన ఈ ఇద్దరు యువకుల సంగతేంటన్న సందేహం మాత్రం వీడలేదు.
Go Back to Shorts
Miryalaguda
Hyderabad
Honor Killing

More Telugu News