తాడిపత్రిలో తగ్గిన ఉద్రిక్తత.. ప్రబోధానంద ఆశ్రమ వర్గీయులతో కలెక్టర్ చర్చలు సఫలం!

  • 3 గంటలు చర్చలు జరిపిన కలెక్టర్
  • స్వస్థలాలకు పయనమైన భక్తులు
  • ఆధార్ కార్డులుంటేనే ఆశ్రమంలో ఉండాలన్న పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద ఉద్రిక్తతలు తగ్గాయి. ఆశ్రమ నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ మూడు గంటల పాటు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బయటివారిని స్వస్థలాలకు పంపేందుకు ఆశ్రమ నిర్వాహకులు అంగీకరించారు. దీంతో ఇప్పటికే అందుబాటులో ఉంచిన బస్సుల్లో భక్తులను అధికారులు తరలిస్తున్నారు. మిగిలినవారిని కూడా సొంత గ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చర్చల ప్రకారం కేవలం ఆధార్ కార్డు ఉన్నవారు మాత్రమే ఆశ్రమంలో ఉండేందుకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు.

రెండ్రోజుల క్రితం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులు, చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలో ఒకరు చనిపోగా, దాదాపు 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామస్తులకు మద్దతుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ధర్నాకు దిగడంతో టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ప్రబోధానంద వర్గీయులు వెనక్కి తగ్గకుంటే లోపలకు దూసుకెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం 2,000 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వీరపాండ్యన్ ఆశ్రమంలోని నిర్వాహకులను కలసి చర్చలు జరిపారు. చివరికి చర్చలు సఫలం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
Anantapur District
tadipatri
collector
talks
successful
prabodhanandha ashramam
aadhaar card
rtc buses

More Telugu News