Andhra Pradesh: విశాఖలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం సింగపూర్ ప్రతినిధులతో సమావేశమైన ఏపీ సీఎస్

  • స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 150 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది
  • అంతర్జాతీయ క్రీడలను నిర్వహించే రీతిలో ఏర్పాటు చేయాలి
  • ఇతర దేశాల నుండి వస్తున్న ప్రతిపాదనలను పరిశీలిస్తాం
ఏపీ సీఎస్ దినేష్ కుమార్ ఈరోజు అమరావతి సచివాలయంలో సింగపూర్ కు చెందిన లగార్దేర్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై విశాఖలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో స్పోర్ట్స్ సిటీ (హబ్) ఏర్పాటుకు 150 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని చెప్పారు. క్రీడా నగరం ఏర్పాటుకు సంబంధించి ఏ విధమైన క్రీడా మౌలిక సౌకర్యాలు కల్పించాలనే దానిపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అన్నారు.

విశాఖలో ఏర్పాటు చేయబోయే క్రీడా హబ్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ క్రీడలను నిర్వహించే రీతిలో దీనిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు అనుగుణంగా అక్కడ సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దుబాయ్, అమెరికా తదితర దేశాల నుండి వస్తున్న ప్రతిపాదనలను పరిశీలించి ఈక్రీడా నగరాన్ని ఏ విధంగా నిర్మించాలనే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రణాళిక శాఖ కార్యదర్శి సంజయ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
cs
dineshkumar

More Telugu News