వివాహేతర సంబంధాల విషయంలో.. శతాబ్దంన్నర కాలం నాటి సెక్షన్ 497 సవరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్!
- 158 ఏళ్ల నుంచి ఒకే సెక్షన్ కింద శిక్షలు
- పురుషుడిది మాత్రమే తప్పంటున్న సెక్షన్ 497
- మార్చే సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్న ధర్మాసనం
- శిక్షార్హమైన నేర జాబితా నుంచి తొలగించే అవకాశం
దీనిపై వాదనలు విన్న ధర్మాసనం, వివాహేతర సంబంధం స్త్రీ, పురుషుల అవసరార్థం ఏర్పడుతుందని, విడాకులు తీసుకోవాలని భావించే వారు మరొకరితో సంబంధం పెట్టుకుంటే చెల్లుబాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 21 కింద వివాహేతర బంధాన్ని, పురుషుడు లేదా స్త్రీ తన జీవితానికి భరోసాను పొందే హక్కులో భాగంగా చూడవచ్చని జస్టిస్ నారిమన్ అభిప్రాయపడటం గమనార్హం.
ఇదే సమయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ, "ఇది మహిళలకు రక్షణగా, వివాహేతర సంబంధాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోందే తప్ప, వాస్తవానికి ఇది మహిళా వ్యతిరేక సెక్షన్. భర్త చెప్పుచేతల్లోనే భార్య ఉండాలని చెప్పకనే చెబుతోంది. మరో వ్యక్తితో సంబంధానికి భర్త అనుమతి తప్పనిసరని కూడా చెబుతున్నట్టు ఉంది" అని అన్నారు. ఈ విచారణ తరువాత కీలకమైన సెక్షన్ 497కు సవరణ అనివార్యమని పలువురు న్యాయ నిపుణులు అంచనా వేస్తుండగా, సీనియర్ న్యాయవాది మీనాక్షీ అరోరా, న్యాయవాదులు కాళీశ్వరన్ రాజు, సునీల్ ఫెర్నాండెజ్ తదితరులు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నారు.