మొత్తానికి చెడ్డీగ్యాంగ్ ఆటకట్టించిన పోలీసులు.. ఆరు నెలల ఆపరేషన్ తర్వాత అరెస్ట్!
- హైదరాబాదీలను వణికించిన చెడ్డీ గ్యాంగ్
- ఆరు నెలల ప్రయత్నం తర్వాత పట్టుకున్న పోలీసులు
- బంగారం, వెండి స్వాధీనం
తాళం వేసి ఉన్న ఇళ్లే చెడ్డీ గ్యాంగ్ టార్గెట్. అమాయకంగా కనిపించే వీరు చీకటి పడగానే విశ్వరూపం ప్రదర్శిస్తారు. తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి దోచుకుంటారు. ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు. చోరీ చేసే సమయంలో చెడ్డీ మాత్రమే ధరిస్తారు. శరీరానికి నూనె పూసుకుంటారు. వెంటాడితే రాళ్లు విసిరి తప్పించుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను కొన్ని నెలలపాటు వణికించిన వీరిని పోలీసులు పక్కా ప్లాన్‌తో సాంకేతికతను ఉపయోగించి పట్టుకున్నారు.
చెడ్డీ గ్యాంగ్ కదలికలపై నిఘా పెట్టిన రాచకొండ పోలీసుల ప్రత్యేక బృందం ముఠా వివరాలు తెలుసుకునేందుకు గుజరాత్‌లోని దాహోద్‌కు వెళ్లింది. అక్కడ నెలరోజులున్న పోలీసులు గ్యాంగ్ కదలికలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీనికి సాంకేతికతను జోడించి పక్కా ప్రణాళిక రచించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా గ్యాంగ్ సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుంటామని రాచకొండ పోలీసులు తెలిపారు.