డేటింగ్ సైట్‌లో పరిచయమైన అమ్మాయి ఇంటికెళ్లి.. దారుణహత్యకు గురైన భారతీయ విద్యార్థి!

  • డేటింగ్ సైట్‌లో యువతితో పరిచయం
  • ఇంటికెళ్లిన యువకుడు
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృతి
డేటింగ్ సైట్‌లో తనకు పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు వెళ్లిన 25 ఏళ్ల భారతీయ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిందీ ఘటన. యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అకౌంటింగ్ విద్యార్థి అయిన మౌలిన్ రాథోడ్ సోమవారం రాత్రి యువతి ఇంట్లో తీవ్ర గాయాలతో పడి ఉండగా, వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు.

సోమవారం రాత్రి 9 గంటల సమయంలో పశ్చిమ మెల్‌బోర్న్‌లోని సన్‌బరీ సబర్బ్‌లో ఉన్న19 ఏళ్ల యువతి ఇంటికి రాథోడ్ వెళ్లినట్టు తెలుస్తోంది. రాథోడ్ తీవ్ర గాయాలతో బాధపడుతున్నట్టు అత్యవసర సేవలకు ఫోన్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆమె అతడిని గాయపరిచినట్టు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. బాధితుడు మృతి చెందడంతో ఇప్పుడు దానిని హత్యకేసుగా మార్చనున్నారు. నిందితురాలైన యువతిని కోర్టు పోలీసుల కస్టడీకి పంపింది.

తమ ఒక్కగానొక్క కొడుకు మృతి విషయం తెలిసిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. రాథోడ్ చాలా మంచి వ్యక్తని, క్రికెట్ ప్రేమికుడని ఆయన స్నేహితుడు తెలిపాడు. రాథోడ్ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Australia
India
Student
Murder

More Telugu News