సంచలన విషయాలు వెల్లడించిన జయలలిత వ్యక్తిగత డ్రైవర్
- మార్చి 6న కమిషన్ ఎదుట కన్నన్ వాంగ్మూలం
- తాజాగా బయటపెట్టిన ఓ ఆంగ్ల దినపత్రిక
- జయ మృతిపై బలపడుతున్న అనుమానాలు
కన్నన్ ఇచ్చిన వాంగ్మూలానికి, శశికళ చెప్పిన దానికి ఏమాత్రం పొంతన లేకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. సెప్టెంబరు 22, 2016న జయలలిత మంచం మీది నుంచి అకస్మాత్తుగా కిందపడిపోయారని, జయ వ్యక్తిగత భద్రతాధికారి వీరపెరుమాళ్ను పిలిపించి చక్రాల కుర్చీలోకి మార్చాలని ప్రయత్నించామని, కానీ సాధ్యం కాలేదని శశికళ పేర్కొన్నారు. అయితే, కన్నన్ చెప్పింది ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
తాను ‘అమ్మ’ గదిలోకి వెళ్లే సరికి కుర్చీలో జయ అచేతన స్థితిలో ఉన్నారని, ఆమె పక్కనే కొన్ని ఫైళ్లు, మూతలేని పెన్ను పడి ఉన్నాయని పేర్కొన్నారు. తనను చూసిన శశికళ వెంటనే ఓ కుర్చీ తీసుకు రమ్మన్నారని తెలిపారు. కుర్చీ కోసం తాను వెళ్లే లోపే ఆమె పడిపోతున్నట్టు అనిపించడంతో స్ట్రెచర్ తీసుకురావాలని అనుకున్నట్టు చెప్పారు.
జయలలిత వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ రాత్రి 8:30 గంటల సమయంలో పొయెస్ గార్డెన్లో కనిపించారని, తర్వాత మళ్లీ గంటపాటు ఆయన జాడలేదని పేర్కొన్నారు. రాత్రి 9:30 గంటలకు మళ్లీ కనిపించిన ఆయన జయతోపాటు ఆసుపత్రికి వెళ్లలేదన్నారు. జయ వెంట శశికళ, వీరపెరుమాళ్ మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.
శివకుమార్ ఆ గంట సేపు ఎక్కడికి వెళ్లారు? ఏమయ్యారు? అన్న విషయాన్ని శశికళ కానీ, వైద్యుడు కానీ తమ వాంగ్మూలాల్లో వెల్లడించలేదు. జయలలిత వ్యక్తిగత డ్రైవర్ అయిన కన్నన్ ఇచ్చిన ఈ వాంగ్మూలం జయ మృతి కేసులో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. శశికళ, శివకుమార్ ఇద్దరూ ఇచ్చిన వాంగ్మూలాలు ఒకలా, కన్నన్ ఇచ్చిన వాంగ్మూలం వారికి పూర్తి విరుద్ధంగా ఉండడం, జయలలిత పక్కన కొన్ని పేపర్లు, పెన్నూ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.