భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని పదేళ్ల తర్వాత తెలిసింది.. షాక్ అయిన హెడ్ కానిస్టేబుల్ భార్య!

  • రెంటచింతలలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న తాలూకారావు
  • మొదటి భార్యకు తెలియకుండా మరో యువతితో వివాహం
  • గుంటూరు రూరల్ ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు
మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు కట్టుకున్న భార్యనే అత్యంత దారుణంగా మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, రమావత్ తాలూకారావు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా ప్రస్తుతం గుంటూరు జిల్లా రెంటచింతలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు 2004 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఆ తర్వాత మాచర్లలో పని చేస్తున్నప్పుడు ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ యువతితో తాలూకారావుకు పరిచయం ఏర్పడింది. ఆమె మాచర్లలోని రోడ్డు పక్కన బండిపై రోటీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెను తాలూకారావు పెళ్లి చేసుకుని, మొదటి భార్యకు అనుమానం రాకుండా సంసారం సాగిస్తున్నాడు. ఆమెతో ఓ కుమార్తె, గత నెలలో ఓ కుమారుడు జన్మించాడు.

అయితే, డ్యూటీ పేరుతో ఆయన సరిగా ఇంటికి రాకుండా ఉండటంతో మొదటి భార్యకు ఈమధ్య అనుమానం వచ్చింది. భర్త కదలికలపై దృష్టి సారించగా అసలు భాగోతం వెలుగుచూసింది. దీనిపై భర్తను నిలదీయగా... తనకు మగ పిల్లలు కావాలని, అందుకే మరో యువతిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇద్దరితోనూ కాపురం చేస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో, తన తండ్రితో కలసి రూరల్ ఎస్పీ అప్పలనాయుడికి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాల్సిందిగా గురజాల డీఎస్పీని అప్పలనాయుడు ఆదేశించారు. 
Go Back to Shorts
rentachintala
head constable
second marriage

More Telugu News