ఇందిరకు పట్టిన గతే.. మోదీకి కూడా!: శరద్ పవార్‌

  • నాడు ప్రజాస్వామ్యాన్ని ఇందిర అపహాస్యం చేశారు
  • నేడూ నాటి పరిస్థితులే
  • విభేదాలను పక్కనపెట్టి పార్టీలన్నీ ఏకం కావాలి
దేశంలో 1977 నాటి పరిస్థితులే ఉన్నాయని, నాడు ఇందిరకు పట్టిన గతే.. ఇప్పుడు మోదీకి కూడా పడుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ హెచ్చరించారు. నాడు ప్రజాస్వామ్యాన్ని ఇందిర భూస్థాపితం చేస్తే.. నేడు మోదీ కూడా అదే పని చేస్తున్నారని ఆరోపించారు. నాడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడంతో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని పవార్‌ గుర్తు చేశారు. ఫలితంగా నాడు ఇందిర ఓడిపోయారని అన్నారు. ఇప్పుడు కూడా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని, ఆ ఫలితమే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి అని పేర్కొన్నారు. భావసారూప్యత ఉన్న పార్టీలను ఏకం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.

పార్టీలతో విభేదాలున్నప్పటికీ బీజేపీని ఓడించేందుకు మాత్రం అంతా కలిసి కట్టుగా ముందుకు రావాలని పవార్ పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో ఎన్సీపీ, కేరళలో లెఫ్ట్, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో కాంగ్రెస్ బలంగా ఉందని పవార్‌ వివరించారు. ఇవన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎన్సీపీ అభ్యర్థి మధుకర్‌ కుకడేతో సమావేశం తర్వాత శరద్ పవార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
sharad pawar
Indira Gandhi
Narendra Modi
NCP

More Telugu News