కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం, విశాఖ యాత్రికులు.. రక్షించాలంటూ వేడుకోలు!
- బస్సులో చార్ధామ్ యాత్రకు బయలుదేరిన విశాఖ, శ్రీకాకుళం వాసులు
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు
- కొండపై చిక్కుకుపోయిన యాత్రికులు
- రక్షించాలంటూ వేడుకోలు
గతనెల 26న 104 మంది యాత్రికులతో కూడిన బృందం బస్సులో చార్ధామ్ యాత్రకు బయలుదేరింది. వీరిలో అత్యధికులు 55 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. కొండపై చిక్కుకుపోయిన వారిలో 38 మంది సురక్షిత ప్రాంతాలకు చేరుకోగా 66 మంది మాత్రం బద్రీనాథ్‌లోని ఓ లాడ్జీలో తలదాచుకున్నారు. ఆపదలో ఉన్న 66 మందిలో ఆరుగురు విశాఖపట్టణం వారు ఉన్నారు. మిగతా వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. బద్రీనాథ్‌లో విశాఖ, శ్రీకాకుళం వాసులు చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అదనపు కమిషనర్ అర్జా శ్రీకాంత్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపాడ సత్యనారాయణ రంగంలోకి దిగారు. వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పనుల పర్యవేక్షణకు ఉత్తరాఖండ్ వెళ్లిన 39 మందితో కూడిన జెడ్పీటీసీలు, అధికారుల బృందం కూడా అక్కడ చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.