ఖాప్ పంచాయతీలకు సుప్రీంకోర్టు చెక్... మేజర్ల వివాహాలను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని తీర్పు
- ఓ స్వచ్చంద సంస్ధ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
- వివాహ చెల్లుబాటును తేల్చే బాధ్యత చట్టానిదని స్పష్టీకరణ
- చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని ఆగ్రహం
శక్తి వాహిని అనే స్వచ్చంద సంస్ధ 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరువు హత్యల నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది. దీంతో ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ముగించి తీర్పు జారీ చేసింది. చట్టాలను చేతుల్లోకి తీసుకుని పరువు పేరిట హత్యలకు పాల్పడితే సహించేది లేదని విచారణలో భాగంగా కోర్టు గత నెలలో ఖాప్ పంచాయతీలపై కఠినంగా స్పందించింది. ఈ పని కోసం వారిని నియమించలేదని, నిరోధానికి చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇద్దరు మేజర్లు వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు అవుతుందా? కాదా? అన్నది తేల్చేందుకు చట్టం ఉందని, దాన్ని నిర్ణయించడానికి ఖాప్ పంచాతీయలకు ఏం అధికారం ఉందని కోర్టు ప్రశ్నించింది.