హైదరాబాదీలకు కొత్త కష్టం... క్యాబ్ లు దొరకక అవస్థలు!
- దేశవ్యాప్తంగా ఓలా, ఉబెర్ డ్రైవర్ల సమ్మె
- డిమాండ్లను పరిష్కరించాలని నిరసన
- క్యాబ్ లు దొరకక ప్రజల ఇబ్బందులు
తాము రూ. 7 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి క్యాబ్ లను ఓలా, ఉబెర్ వంటి సంస్థల్లో రిజిస్టర్ చేసుకుంటే, నెలకు లక్షన్నర రూపాయల వరకూ ఆదాయం వస్తుందని మోసపు మాటలు చెప్పారని, ప్రస్తుతం దానిలో సగం కూడా తమకు రావడం లేదని డ్రైవర్ల సంఘం నేత సంజయ్ నాయక్ ఆరోపించారు. కంపెనీ అధీనంలోని కార్లకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, డ్రైవర్ యజమానిగా ఉన్న కార్లకు బుకింగ్స్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. లోన్ గ్యారెంటీ లెటర్లు ఇవ్వడం లేదని, ముద్రా స్కీమ్ ఉన్నప్పటికీ దాన్ని తాము వినియోగించుకోలేకున్నామని తెలిపిన ఆయన, తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓలా, ఉబెర్ యాజమాన్యాలు దిగిరాకుంటే, సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.