Sivaji: కుక్కలాగా ఇల్లిల్లూ తిరిగి బీజేపీకి ఓట్లడిగాను... ఇదా మీరు చేసేది?: సినీ నటుడు శివాజీ నిప్పులు

  • బీజేపీ మాటలను నమ్మి 2014 ఎన్నికల్లో మద్దతిచ్చా
  • నేను కూడా బీజేపీలో ఉన్న వాడినే
  • నన్ను చంపాలంటే చంపండి
  • బీజేపీ కార్యకర్తలకు శివాజీ హెచ్చరికలు
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, విజయవాడలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో సినీ నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, విభజనతో నష్టపోయిన ఏపీకి హోదా, రైల్వే జోన్ లతో పాటు పలు ఫ్యాక్టరీలు, విద్యాసంస్థలను తాము అధికారంలోకి వస్తే ఇస్తామని బీజేపీ చెప్పిన మాటలను నమ్మి 2014 ఎన్నికల్లో తాను ఆ పార్టీకి మద్దతిచ్చానని అన్నారు.

 "నాపై ఎగబడినా వెనక్కు పోయే మనిషిని కాను. నామీద జరిగే దాడి తెలుగువాడి మీద జరిగే దాడిగా గుర్తుంచుకోండి. ఇదే భారతీయ జనతా పార్టీ కోసం 2014లో కుక్కలాగా ఇల్లిల్లూ తిరిగి ఓట్లడిగా నేను. మోదీ మా ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇచ్చి... ఈ రాష్ట్రాన్ని... (ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు మరోసారి ఆందోళనకు దిగారు) సోదరా... నేనూ బీజేపీలో ఉన్నవాడినే. ఆరోజు మీరెవరూ లేరు. ఇవాళ మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏమైనా చేయండి. నామీద దాడి చేయండి  చంపండి. కానీ నా చావుకోసమైనా తెలుగువాళ్లంతా ఒక్కటై తిరగబడతారు" అని బీజేపీపై నిప్పులు చెరిగారు.

తాను మరణిస్తే, తనవంటివారు వంద మంది పుడతారని, వారి ఆగ్రహానికి బీజేపీ నాశనమవుతుందని హెచ్చరించారు. హోదాపై తన వాదనేంటో బీజేపీ నాయకులు తెలియజేయాలని, అంతే తప్ప ప్రశ్నించేవారిపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో భారతీయ జనతా పార్టీకి ఇలా దాడులు చేసే సంస్కృతి లేదని, ఇప్పుడు కొత్తగా ఆ సంస్కృతిని తీసుకు వచ్చారని విమర్శించారు. విజయవాడలో ఆర్ఎస్ఎస్ సోదరులతోనూ తనకు పరిచయాలు ఉన్నాయని, గతంలో ఎన్నడూ క్రమశిక్షణ తప్పని వారు ఇప్పుడు ఇలా ఎందుకు అసహనాన్ని పెంచుకుంటున్నారని ప్రశ్నించారు. ఇదా భారతీయ జనతా పార్టీ? ఇలాగేనా మీరు చేసేది? దమ్ముంటే, మీకు చేతనైతే బీజేపీ వాదనను ప్రజలకు వివరంగా చెప్పాలని, చెప్పలేకుంటే తప్పు ఒప్పుకోండని శివాజీ కోరారు.
Sivaji
Vijayawada
Andhra Pradesh
Special Category Status

More Telugu News