Congress: ప్రకాశం బ్యారేజీకి టీడీపీ చేసిందేమీ లేదు.. ఆ ఖ్యాతి మాదే!: ఏపీ కాంగ్రెస్
- అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ చేసిందేమీలేదు
- చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్న చందంగా ఉంది తీరు
- తూతూ మంత్రంగా సభ పెట్టి బ్యారేజీ నిర్మాణం తమ ఘనతేనని టీడీపీ అవాస్తవాలు
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారిందంటే అది ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వల్లేనని, దీనిని నిర్మించిన ఖ్యాతి తొలుత బ్రిటిష్ పాలకులకు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
"అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ చేసిందేమీలేదు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్న చందంగా ప్రకాశం బ్యారేజీ 60 ఏళ్ల ఉత్సవాలు అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. పత్రికల్లో వ్యాసాలు వచ్చేవరకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకి.. ఉత్సవాలు నిర్వహించాలన్న ఆలోచనే తట్టలేదు. ఇప్పుడేమో బ్యారేజీకి దీపాలు వెలిగించి, తూతూ మంత్రంగా ఒక సభ పెట్టి బ్యారేజీ నిర్మాణం కూడా తమ ఘనతేనని అవాస్తవాలు ప్రచారం చేసుకుందామనుకుంటున్నారు" అని అందులో పేర్కొన్నారు.