ఉలిక్కిపడిన యాదాద్రి.. ఒకే ఇంట్లో ఏడుగురు అనుమానాస్పద మృతి!
- మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు
- హత్యా? ఆత్మహత్యా? అన్నదానిపై ఆరా తీస్తున్న పోలీసులు
- జిల్లాలో సంచలనం
పోలీసుల కథనం ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడ గ్రామానికి చెందిన బాలరాజు నెల రోజులుగా భార్య తిరుమలతో కలిసి రాజాపేటలోని నాగభూషణం కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. దీనికి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వీరిని చూసేందుకు గురువారం తిరుమల తల్లిదండ్రులు రాజాపేట వచ్చారు. అయితే తెల్లారేసరికి అందరూ మృతి చెంది ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే కుటుంబానికి చెందిన వీరంతా నిద్రలోనే ఎలా ప్రాణాలు కోల్పోయారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక, ఎవరైనా హత్య చేశారా? లేదంటే, ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగిందా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. మృతి చెందిన వారిలో బాలరాజు, తిరుమల దంపతులతోపాటు వారి ముగ్గురు పిల్లలు, చూడడానికి వచ్చిన తిరుమల తల్లిదండ్రులు ఉన్నారు.