Varun Gandhi: నా ఇంటి పేరు గాంధీ కాకుంటేనా.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి పేరు కనుక గాంధీ కాకపోయి ఉంటే 29 ఏళ్లకే తాను ఎంపీని అయి ఉండేవాడినని పేర్కొన్నారు. ఇంటి పేరు ఏదైనా ప్రజలందరికీ సమానహక్కులు లభించాలన్నదే తన అభిమతమన్నారు. అటువంటి దేశాన్నే తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. రంగమేదైనా సామాన్యులకు మాత్రం అన్ని ద్వారాలు మూసుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్, వ్యాపారం, సినిమాలు.. ఇలా అన్నింటిలోనూ సామాన్యులకు అవకాశాలు అందకుండా పోతున్నాయని అన్నారు.  

ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలని సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని వరుణ్ గాంధీ సూచించారు. హామీలు నెరవేర్చని ప్రజా ప్రతినిధులను అభిశంసన ద్వారా తప్పించే అవకాశం లభిస్తే 75 శాతం మంది ఎంపీలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Varun Gandhi
BJP

More Telugu News