హిందీ 'బిగ్ బాస్'.. తిట్లు.. బూతులు.. వివాదం... సల్మాన్ ఖాన్ పై కేసు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీ 'బిగ్ బాస్'.. తిట్లు.. బూతులు.. వివాదం... సల్మాన్ ఖాన్ పై కేసు!

  • ఆరంభంలోనే వివాదాస్పదమైన బిగ్ బాస్ సీజన్ 11
  • జుబైర్ ఖాన్, అర్షి ఖాన్ కు సల్మాన్ క్లాస్
  • ఆత్మహత్యాయత్నం చేసి, ఐసీయూలో చేరిన జుబైర్
  • షో నుంచి ఎలిమినేట్ కావడంతో సల్మాన్ పై కేసు
ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌ బాస్‌ సిజన్ 11 ఆరంభంలోనే వివాదాస్పదమవుతోంది. అసభ్య ప్రవర్తన, రెచ్చగొట్టడం, నిబంధనలు అతిక్రమించడం, బండబూతులు తిట్టుకోవడం.. ఇలా అభ్యంతరకరమైన ప్రవర్తనతో ఆరంభం నుంచి వివాదాలకు కేంద్రమైంది. వారాంతం ఎపిసోడ్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోని సభ్యుల ప్రవర్తనపై సల్మాన్ విరుచుకుపడ్డాడు. ఏం చేస్తున్నారో అర్ధమవుతోందా? అంటూ ప్రశ్నించాడు. మీమీ ఇళ్లలో తల్లి, అక్కాచెల్లెళ్లతో ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఇందుకేనా బిగ్ బాస్ కు వచ్చారు? దేశం పరువే కాకుండా, మీ ఇంటి పరువు ప్రతిష్ఠలు, మీ ప్రాంతం పేరు ప్రతిష్ఠలు మంటగలిపారని మండిపడ్డాడు.

 ఈ షో ఆరంభం నుంచి ఆడ, మగ తేడా లేకుండా అందర్నీ బూతులు తిడుతున్న జుబైర్ ఖాన్ పై సల్మాన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దావూద్ ఫ్యామిలీకి చెందిన వాడివంటూ వచ్చిన కథనం నీ జీవితాన్ని మార్చేసిందని, భార్య, పిల్లలు దూరమయ్యారని, వారిని దగ్గరకు చేర్చుకుంటానని షోలోకి ఎంటరైన నువ్వు ఇలా ప్రవర్తిస్తే.. నిన్ను ఎవరు దగ్గరకి రానిస్తారని ప్రశ్నించాడు. దావూద్ కుటుంబానికి చెందిన వాడవని ప్రచారం చేసుకోవడం వల్ల వచ్చే భయాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నావా? అని నిలదీశాడు. డోంగ్రీ నుంచి వచ్చానని, డాన్ లంతా డోంగ్రీ నుంచి వచ్చిన వారేనని బెదిరిస్తున్నావు? మీకు డాన్ లని ఏ స్కూల్ సర్టిఫికేట్ ఇచ్చింది? అని కడిగేశాడు.

'డోంగ్రీ పరువు తీశావు. అక్కడ నాకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎవరూ నీ అంత దరిద్రంగా లేరు' అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో బిత్తరపోయిన జుబైర్ ఖాన్ 'అది కాదు సల్మాన్ భాయ్..' అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇకపై తనను అలా పిలవొద్దని హెచ్చరించాడు. ఆడవాళ్లను తిట్టడానికి సిగ్గుపడాలని సూచించాడు. ఈ సందర్భంగా షాహిద్ అఫ్రిదీ ప్రియురాలుగా ప్రచారం పొందిన అర్షిఖాన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, 'నీక్కూడా చెబుతున్నాను... పధ్ధతిగా మసలుకోవడం నేర్చుకో' అన్నాడు.

 అంతే కాకుండా మీరిద్దరూ మాటకు ముందోసారి, మాట తరువాతోసారి అల్లా, తోబతోబ అంటున్నారని, మీకా అర్హత లేదని తేల్చిచెప్పాడు. దేశం, ప్రాంతం, కుటుంబం, మతం పరువుతీశారని సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం జుబైర్ ఖాన్ ఆత్మహత్యాయత్నం చేశాడని, ఐసీయూలో చేరాడని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో జుబైర్ ఖాన్ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. అనంతరం జుబైర్‌ ఖాన్‌ బిగ్ బాస్ హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ పై ముంబైలోని అంటాప్‌ హిల్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 
salman khan
bigg boss
jubair khan
police case
bog boss 11

More Telugu News