తిరుమల: మరో వివాదంలో తిరుమల ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు!
- ‘మహాద్వారం’ గుండా ఆలయంలోకి వెళ్లిన రమణదీక్షితుల కుమారుడు, మనవళ్లు
- శ్రీవారి గర్భగుడిలోకీ వెళ్లారంటున్న అధికారులు!
తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. నిన్న ఉదయం 5.30 గంటలకు తన కుమారుడు వెంకటపతి దీక్షితులు, ఇద్దరు మనవళ్లతో మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడంపై విమర్శలు తలెత్తాయి.
రెండేళ్లుగా విధుల్లో లేని వెంకటపతి దీక్షితులు, ఆయన ఇద్దరి కుమారులు నిబంధనలకు వ్యతిరేకంగా మహాద్వారంలో నుంచి వెళ్లడం వివాదంగా మారింది. అంతేకాకుండా, శ్రీవారి గర్భగుడిలోకి కూడా వెంకటపతి దీక్షితులు వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విషయం తెలిసిన టీటీడీ ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
కాగా, ఇటీవల జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనంపై తన కుమారుడు వెంకటపతి దీక్షితులకు విధులు కేటాయించిన రమణదీక్షితులు విమర్శలకు గురయ్యారు. తాజాగా, ఈ వివాదంలో ఆయన చిక్కుకున్నారు. మహాద్వారం గుండా ఆలయ అర్చకులు, ఉన్నతాధికారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రధాన అర్చకుని సతీమణి మినహా మిగిలిన కుటుంబీకులు బయోమెట్రిక్ లేదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది.