: పండగల సీజన్ కు ముందే రానున్న ‘డస్టర్’ కొత్త వేరియంట్
స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ) ‘డస్టర్’లో కొత్త వేరియంట్ శాండ్ స్ట్రామ్ త్వరలో మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ విషయాన్ని రెనో ఇండియా దేశీయ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎండీ, సుమిత్ సానే వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ముందుగా క్విడ్ 02 (వార్షిక ఎడిషన్) ను తీసుకురానున్నామని, పండగల సీజన్ కు ముందే డస్టర్ శాండ్ స్ట్రామ్ ను విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఎస్ యూవీ కాప్చర్ విడుదల చేస్తామని, చెన్నై సమీపంలోని తయారీ కేంద్రంలో ఈ తరహా వాహనాలను తయారు చేయనున్నామని తెలిపారు. ఈ ఏడాదిలో భూటాన్, బంగ్లాదేశ్ దేశాలకు రెనో కార్లను ఎగుమతి చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, ‘రెనో’ నుంచి ప్రస్తుతం చిన్న కారు క్విడ్, ఎస్ యూవీ డస్టర్, మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎంపీవీ) లాడ్జి కార్లను వినియోగదారులకు విక్రయిస్తోంది.