: గుర్మీత్ సింగ్ ఫాలోయింగ్‌కి కారణం ఇదే!
రేప్ కేసులో గుర్మీత్ సింగ్‌ను దోషిగా నిర్ధారిస్తూ పంచకుల సీబీఐ కోర్డు తీర్పు ఇవ్వగానే ఆ ప్రాంతమంత ఉద్రిక్తంగా మారింది. అతని అనుచరులు మీడియా వ్యాన్లను, రైల్వేస్టేషన్లను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. గుర్మీత్ సింగ్ కోర్టుకు హాజరయ్యే ముందే లక్షల మంది అభిమానులు పంచకుల కోర్టు ప్రాంగణంలో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇంత మంది అభిమానానికి డేరా సచ్చాసౌధా పేరుతో ఆయన చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలే కారణం. గుర్మీత్ ఎంతలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తాడంటే... రక్తదానం, వివిధ ఆరోగ్య పరీక్షలకు సంబంధించి క్యాంపులు నిర్వహించడంలో ఆయన పదికి పైగా గిన్నిస్ రికార్డులు సాధించారు.
డేరా సచ్చాసౌదాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాదిమంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో ఎలాంటి కులాల అడ్డుగోడలుండవు. పంజాబ్, హరియాణాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాదిమంది దళితులు దీన్ని స్వీకరించారు. ప్రార్థనల కోసం నామ్ చర్చా ఘర్‌లను ఏర్పాటుచేశారు. డేరాల్లో సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉండే డేరాల వల్ల పేదలకు ఎంతో లాభం చేకూరుతోంది. పంజాబ్‌లోని సంగ్రూర్, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు.