: నంద్యాల ఉప ఎన్నికకు సర్వం సిద్ధం!
భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. నంద్యాలలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పారా మిలటరీ బలగాలు కూడా చేరుకున్నాయి. ఏవైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే పరిష్కరించడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
పోలింగ్ బూత్‌లకు ఓటింగ్ సామగ్రి తరలించామని ఓ ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఈ ఎన్నిక సజావుగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. నంద్యాల నియోజక వర్గంలో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ నెల 28న జరగనుంది.