: ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ అసభ్యకరంగా ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ పై బీసీ యువజన సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసభ్యకరమైన పోస్టర్ ను చిత్రీకరించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లపై తగిన చర్యలు తీసుకోవాలంటూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ ఈ రోజు మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, యువతను తప్పుదోవ పట్టించేలా చిత్రీకరించిన ఈ వాల్ పోస్టర్లను తొలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యా సంస్థలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన అసభ్యకర వాల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయని, యువతను ఆకర్షించేందుకు విష సంస్కృతిని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్యామ్ కురుమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.