: ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్‌ను వెనకేసుకొచ్చిన చైనా
`ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడంలో పాకిస్థాన్ గొప్ప త్యాగాలు చేసింది. ఇతర దేశాలతో పోల్చితే ఆ విషయంలో పాకిస్థాన్ ఎప్పుడూ ముందే ఉంది` అంటూ చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. ఉగ్రవాదాన్ని, దానికి కొమ్ముకాస్తున్న దేశాలను నాశనం చేయడానికి ఎంత పెద్ద యుద్ధానికి దిగడానికైనా అమెరికా సిద్ధమేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.
ఆఫ్ఘనిస్థాన్‌కు సహాయంగా దళాలను పంపడానికి అమెరికా సిద్ధంగా ఉందని, భారత్, పాకిస్థాన్, ఇతర నాటో దేశాలు కూడా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి ముందుకు రావాలని ట్రంప్ అన్నారు. అలాగే టెర్రరిస్టులకు కొమ్ముకాస్తున్న దేశంగా పాకిస్థాన్‌ను అభివర్ణిస్తూ ఆయన కొన్ని పరోక్షవ్యాఖ్యలు, హెచ్చరికలు చేశారు. దీనిపై చైనా స్పందిస్తూ టెర్రరిజాన్ని మట్టుపెట్టడంలో పాకిస్థాన్ తనవంతు కృషిచేస్తోందని వెనకేసుకొచ్చింది. `ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి పాకిస్థాన్, అమెరికా ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషకర విషయం. వీరి ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మంచి రోజులను తీసుకొస్తుందని భావిస్తున్నా!` అని హువా చున్యింగ్ తెలిపారు.