: రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్ పట్టించి... బ్యాడ్జి గెలిచిన శునకం!
ఇంటి ఆవరణలో చాలా కాలం క్రితం పాతిపెట్టిన మాదకద్రవ్యాలను పట్టించి, ప్రతిష్టాత్మక నార్కోటిక్స్ కే9 బ్యాడ్జి సొంతం చేసుకుంది అమెరికాలోని ఓ శునకం. ఒరెగాన్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన శునకం రూ. 50 లక్షల విలువైన మాదకద్రవ్యాలను పట్టించింది. దీని పేరు కెన్యాన్.
`ఇంటి పెరట్లో గంట పాటు తవ్వి, ఏదో ప్యాకెట్‌ను కెన్యాన్ తీసుకువచ్చింది. మేం ఆసక్తితో అందులో ఏముందో చూడటానికి ప్రయత్నించాం. తీరా చూస్తే అందులో ప్రమాదకర మత్తు పదార్థమైన బ్లాక్ హెరాయిన్ ఉంది. బహుశా ఇంతకు ముందు ఈ ఇంట్లో నివసించినవాళ్లు పాతిపెట్టి ఉంటారని భావించి, మేం వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాం. మా డాగ్ చేసిన పనికి వారు మెచ్చుకుని కే9 బ్యాడ్జి బహూకరించి వెళ్లారు` అని ఇంటి యజమాని తెలిపారు. ఈ విషయాన్ని వాళ్లు ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, నెటిజన్లు కెన్యాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.