: మొబైల్ వినియోగదారులకు శుభవార్త.. గణనీయంగా తగ్గనున్న కాల్ చార్జీలు!
ఏడాది క్రితం మొబైల్ కాల్ చార్జీలు గణనీయంగా తగ్గిన తర్వాత ఇప్పుడు మరోమారు కాల్ చార్జీలు మరింత చవక కానున్నాయి. మొబైల్ ఆపరేటర్లు చెల్లించే ఇంటర్ కనెక్ట్ కాల్ చార్జీలను తగ్గించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలు (ఐయూసీ) నిమిషానికి 14 పైసలుగా ఉంది. దీనిని 10 పైసలు కంటే తక్కువగా చేయాలని ట్రాయ్ నిర్ణయించినట్టు సమాచారం.
టెలికం రంగంలోకి జియో ప్రవేశించిన తర్వాత ఐయూసీ చార్జీల విషయమై విపరీతమైన చర్చ జరిగింది. జియో ఉచిత కాల్స్ ఆఫర్‌తో ఇంటర్ కనెక్ట్ పేరిట ఇతర కంపెనీలు పెద్దమొత్తంలో చార్జ్ చేశాయి. దీంతో ఐయూసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ తదితర కంపెనీలు ఐయూసీ పేరుతో వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. అంతేకాదు ఈ చార్జీలను మరింత పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.
ఎయిర్‌టెల్ గతేడాది ఐయూసీ ద్వారా ఏకంగా రూ.10,279 కోట్లు ఆర్జించింది. అంతేకాదు ప్రస్తుతం నిమిషానికి 15 పైసలుగా ఉన్న ఐయూసీని 30 పైసలకు పెంచాలని డిమాండ్ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాయ్ ప్రత్యర్థి కంపెనీలకు షాకిస్తూ జియో ప్రతిపాదనకు ఓటేసింది. ఐయూసీ చార్జీలను మరింత తగ్గించడం ద్వారా వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇంటర్ కనెక్టివ్ కాల్స్‌పై చార్జీలను 15 పైసల నుంచి పది పైసల దిగువకు తగ్గించాలని నిర్ణయించింది. త్వరలోనే ఇది అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే వాయిస్ కాల్స్ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.