Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్‌టెల్ బిల్లు చూసి షాక్‌కు గురైన వినియోగదారుడు.. పది రోజుల రోమింగ్‌కు రూ.2 లక్షలు!

కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తికి టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ దిమ్మదిరిగే షాకిచ్చింది. పది రోజుల ఇంటర్నేషనల్ రోమింగ్‌కు లక్షల్లో వచ్చిన బిల్లును చూసి అతడి గుండె ఆగినంత పనైంది. న్యూఢిల్లీకి చెందిన నితిన్ సేథీకి ఈ అనుభవం ఎదురైంది. గత నెలలో కుటుంబ సభ్యులతో కలిసి అతడు దుబాయ్ వెళ్లాడు. అక్కడకి వెళ్లినా ఫోన్‌లో టచ్‌లో ఉండేందుకు తాను వినియోగిస్తున్న ఎయిర్‌టెల్ నుంచి పది రోజులపాటు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకున్నాడు.

 టూర్ ముగించుకుని ఇండియాలో అడుగుపెట్టిన అతడి ప్యాకేజీ డీ యాక్టివేట్ కాలేదు. ఫలితంగా జూన్ 8 నుంచి జూలై 7 వరకు నెల రోజులకు గాను ఏకంగా రూ.1.86 లక్షల బిల్లు వచ్చింది. దీంతో కంగుతిన్న నితిన్ వెంటనే వినియోగదారుల సేవా కేంద్రానికి ఫిర్యాదు చేయగా, సాంకేతిక కారణాల వల్లే బిల్లు తప్పుగా జనరేట్ అయిందని వివరణ ఇచ్చారు. మరో బిల్లు పంపిస్తామని చెప్పడంతో సేథీ ఊపిరి పీల్చుకున్నాడు. ఎయిర్‌టెల్ తనకు పంపిన బిల్లును నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

More Telugu News