: బుల్లెట్లా... ఎలా ఉంటాయి?: పోలీసుల విచారణలో విక్రమ్ గౌడ్ దిమ్మతిరిగే సమాధానం!
అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు తన తండ్రి, మామల నుంచి డబ్బులు తీసుకోవాలన్న పన్నాగంతో, తనను తాను కాల్పించుకోవాలని సుపారీ ఇచ్చుకున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు, విక్రమ్ గౌడ్, పోలీసుల విచారణలో దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చాడని తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ ను ఒక రోజు పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆయన్నుంచి ఎలాంటి ప్రశ్నలకూ సమాధానం రాబట్టలేకపోయినట్టు సమాచారం. తుపాకీ ఎక్కడ కొన్నారు? కొనుగోలు చేసిన 20 బుల్లెట్లలో మూడింటిని వాడగా, మిగతావి ఎక్కడ? వంటి ప్రశ్నలకు ఆయన తిక్క తిక్క సమాధానాలు చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
బుల్లెట్లా.. అవి ఎలా ఉంటాయి? తుపాకిని నేను జీవితంలో చూడలేదు... అంటూ పోలీసుల సహనానికి విక్రమ్ గౌడ్ పరీక్షగా నిలిచాడని, అతన్ని మరోసారి కస్టడీకి తీసుకుంటామని వారు తెలిపారు. మిగతా బుల్లెట్లను ఎక్కడ దాచారన్న విషయాన్ని తేల్చేందుకు మరోసారి ఆయన ఇంటికి సోదాలకు వెళ్లిన పోలీసులు కూడా ఉత్త చేతులతోనే తిరిగి వచ్చారు. ఇక పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకూ విక్రమ్ గౌడ్ సూటిగా సమాధానం చెప్పలేదని, ఆయన్నుంచి ఎంతో సమాచారం రాబట్టాలని భావించిన పోలీసులు విఫలమైనట్టు తెలుస్తోంది. విక్రమ్ ను ఉదయం 10 గంటలకు జైలు నుంచి తీసుకుని వచ్చి, ప్రశ్నించి సాయంత్రం 4 గంటల్లోగా తిరిగి జైల్లోకి పంపాల్సిన పోలీసులకు ప్రశ్నించేందుకు తగినంత సమయం లభించకపోగా, విక్రమ్ కూడా కాలయాపన చేసేందుకే ప్రయత్నించాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.