: ఐపీఎల్ మీడియా హక్కులపై బీసీసీఐకి సుప్రీం నోటీసు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులను ఈ-వేలం ద్వారా అందజేయాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కి భారత అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై త్వరగా బీసీసీఐ సమాధానం తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. ఈ-వేలం ద్వారా ప్రసార హక్కులను అందజేయడమే సరైన విధానమని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాదాపు రూ. 30 వేల కోట్లు విలువ చేసే ఐపీఎల్ మీడియా హక్కులను సాధారణ పద్ధతిలో కేటాయించడం సబబు కాదని ఆయన పిల్‌లో పేర్కొన్నారు.
ఈ-వేలం ద్వారా మీడియా హక్కులు జారీచేయడంలో పారదర్శకత ఉంటుందని సుబ్రమణియన్ తెలిపారు. ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులు జారీ చేయబోయే వేలం ఆగస్టు 28న ప్రారంభంకానుంది. 2008లో పదేళ్ల కాలానికి ఐపీఎల్ మీడియా హక్కులను 918 మిలియన్ డాలర్లకు సింగపూర్‌కు చెందిన వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ చేజిక్కించుకుంది. తర్వాత సంవత్సరానికే ఆ కాంట్రాక్టు రద్దవడంతో 1.63 బిలియన్ డాలర్లు చెల్లించి 9 ఏళ్ల కాలానికి సోనీ గ్రూప్ ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకుంది.