: జీఎస్టీ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది: సీపీఎం నేత రాఘవులు
సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రేపు, ఎల్లుండి కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ, ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చిస్తున్నామని చెప్పారు.
జీఎస్టీ, దేశ వ్యాప్తంగా మతోన్మాదం, మతకలహాలను పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వం, మైనార్టీలపై సంఘ్ పరివార్ శక్తులు చేస్తున్న అరాచకాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన, నిరుద్యోగులకు ఉపాధి కల్పనపైన చర్చిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఏడాదిలోనే డెబ్భై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు పోయాయని, దీంతో, నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతోందని అన్నారు. జీఎస్టీ విషయంలో గానీ, ప్రజల హక్కులను పరిరక్షించడంలో గానీ కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అవలంబిస్తున్న పద్ధతులన్నీ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని రాఘవులు ధ్వజమెత్తారు.