: మద్యపాన నిషేధంతో కష్టంగా మారిన టీబీ డయాగ్నసిస్!
గతేడాది నుంచి బిహార్‌లో అమలులో ఉన్న మద్యపాన నిషేధం మంచి విషయమే అయినా తమను చాలా ఇబ్బందులకు గురి చేస్తోందంటున్నారు బిహార్ ఆరోగ్య శాఖ అధికారులు. ప్రయోగశాలల్లో క్షయ వ్యాధిని గుర్తించడానికి ఇథైల్ ఆల్కహాల్ అవసరం. మద్యపాన నిషేధంతో ఆల్కహాల్ అందుబాటులో లేకపోవడంతో కేవలం ఆరోగ్య సంబంధ ప్రయోగశాలలు, ఆసుపత్రుల వరకు ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని బిహార్ ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖను కూడా రాశారు. బిహార్‌లో గతేడాది 64,158 మందికి క్షయ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. ఈ ఏడాది పరీక్షలు చేయడానికి ఆల్కహాల్ అందుబాటులో లేకపోవడంతో వ్యాధి తీవ్రతను అంచనా వేయలేకపోతున్నారు. తద్వారా సంబంధిత వ్యాధి నివారణ చర్యలు తీసుకోలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.