: 'విద్వేషాలు రెచ్చగొట్టడం సమంజసమా?' అంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ మహిళా నేత!
సోషల్ మీడియాలో తప్పుడు ఫొటోలు పోస్ట్ చేసి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ బీజేపీ నేత నుపూర్ శర్మ. పశ్చిమ బెంగాల్ లో ఒకవైపు మతహింస, మరోవైపు నక్సల్ సమస్య, ఇంకోవైపు గూర్ఖాల్యాండ్ ఉద్యమంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె... హిందువులపై దాడులు జరుగుతున్నాయని, బెంగాల్ లోని హిందువులకు మద్దతివ్వాలని కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. అంతే కాకుండా ఆ ఫోటోలు బెంగాల్ పోలీసులను చేరేవరకు షేర్ చేయండని ఆమె కోరారు. దీంతో నెటిజన్లను, ఇతర మద్దతుదారులు ఆ ఫోటోలను విచ్చలవిడిగా షేర్ చేశారు. దీంతో విద్వేషాలు మరింత రేగాయి.
ఈ నేపథ్యంలో ఆ ఫోటోలు 2002లో మోదీ సీఎంగా ఉండగా గుజరాత్ లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఫోటోలని నెటిజన్లు నిర్ధారించారు. దీంతో వివాదాలకు దారితీసేలాంటి ఫొటోలను పోస్ట్ చేస్తూ...విద్వేషాలు రాజేసే నుపూర్ లాంటి నేతల్ని అరెస్ట్ చేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన మహిళ ఇలా విద్వేషాలు రేపడం సరైనదేనా? అని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై ఆమె వివరణ ఇస్తూ... ఆ ఫోటోలు గుజరాత్ అల్లర్లకు సంబంధించినవని తనకు తెలుసని....అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులు అప్పటి గుజరాత్ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయని చెప్పడానికే వాటిని పోస్టు చేశానని వివరణ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఆ ఫోటోలు పశ్చిమబెంగాల్ పోలీసులకు చేరే వరకు షేర్ చేయమని ఎందుకు చెప్పారని నిలదీస్తున్నారు.