: చైనా హెచ్చరికలు బేఖాతరు.. సరిహద్దుల్లో గుడారాలు ఏర్పాటు చేస్తున్న భారత సైన్యం!
డ్రాగన్ కంట్రీ హెచ్చరికలను భారత్ బేఖాతరు చేసింది. ఉద్రిక్తతలు నెలకొన్న డోక్లాం నుంచి సైన్యాన్ని బేషరుతుగా వెనక్కి పిలిపించుకోవాలన్న చైనా హెచ్చరికలను తోసిరాజని ఏకంగా సరిహద్దులో గుడారాలు (టెంట్లు) నిర్మిస్తోంది. తద్వారా ఇప్పుడే కాదు.. ఇంకా చాలా రోజులు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటామంటూ చెప్పకనే చెప్పింది. వివాదాస్పద ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ శరవేగంగా గుడారాలు నిర్మిస్తోంది. అవసరమైతే సుదీర్ఘ స్టాండాఫ్‌కు సిద్ధమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
భూటాన్ త్రికూడలిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే భారత్ తన సైన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా వెనక్కి పిలుపించుకోవాలని చైనా పలుమార్లు కోరింది. బంతి భారత్ కోర్టులోనే ఉందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించింది. అయితే ఆ బెదిరింపులకు తాము లొంగే రకం కాదని ఇండియన్ ఆర్మీ తాజా చర్యతో నిరూపించింది. గుడారాలు వేసుకుంటున్న సైనికులకు ఆహార పదార్థాలు పూర్తి స్థాయిలో సరఫరా అవుతున్నట్టు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.
చైనా ఒత్తిళ్లకు తాము లొంగబోమని ఆయన పేర్కొన్నారు. అయితే అదే సమయంలో సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. గతంలోనూ పలు సరిహద్దు వివాదాలను ఇలానే పరిష్కరించుకున్నట్టు తెలిపారు.
కాగా, ఇరు దేశాలు 2012లో సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ఓ అంగీకారానికి వచ్చాయి. వివిధ స్థాయుల్లో చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని ఒప్పందానికొచ్చాయి. అయితే చాలా ఏళ్లుగా ఈ ఒప్పందానికి విలువ లేకుండా పోయింది.