: బస్సెక్కిన షారూక్ భలే విన్యాసం చేశాడు!
షారూక్ ఏంటీ? బస్సెక్కడ మేంటీ? అనే అనుమానం వద్దు. నిజంగానే, ఆయన బస్సులో ప్రయాణించి.. ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. షారూక్ బస్సెక్కడం ఓ ఆశ్చర్యమైతే.. ఆ బస్సులో షారూక్ చేసిన విన్యాసం మరో ఆశ్చర్యమనే చెప్పాలి. నిలబడి ప్రయాణించేటప్పుడు సపోర్ట్ నిమిత్తం బస్సు లోపల ఉండే క్లాత్ బెల్టులను పట్టుకున్న షారూక్, అమాంతం పైకి లేచి పిల్లిమొగ్గ వేశాడు. దీంతో, బస్సులోని ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే, యాభై ఏళ్లకు పైబడిన షారూక్ ఎంత ఫిట్ గా ఉన్నాడో అని! ఈ వీడియోను ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వచ్చే నెల 4న విడుదల కానున్న ఈ చిత్రంలో షారూక్ సరసన అనుష్క శర్మ నటిస్తోంది. కాగా, షారూక్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబయ్ సిటీ బస్సులో ఈ విన్యాసం చేశాడని తెలుస్తోంది. అంతేకాకుండా, ‘స్పైడర్ మ్యాన్: హోం కమింగ్ సినిమా’ ఈ రోజు విడుదలైంది. స్పైడర్ మ్యాన్ లా షారూక్ కూడా ఓ విన్యాసం చేసి తన చిత్ర ప్రమోషన్ ను వినూత్నంగా చేశాడంటున్న వారూ లేకపోలేదు.