: .పంచాయతీ ఆటవిక తీర్పు: తన భార్య తప్పుచేసిందని చెబుతూ... ఊరూరా గంట కొట్టుకుంటూ తిరిగిన భర్త!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అయిన మన దేశంలో ఆటవిక పంచాయతీ తీర్పు వెలుగుచూసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే...ఒడిశాలోని అనుగుల్ జిల్లా రగుడిపడా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఒక వ్యక్తిని గ్రామస్థులు ప్రతిపాదించారు. అందరూ అతనికే ఓటేసినా, వార్డు మెంబర్ మల్లికా సాహు మాత్రం తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేశారు. ఇది గ్రామస్థులకు ఆగ్రహం కలిగించింది. అంతే, పంచాయతీ పెట్టారు. ఆమె తప్పు చేసిందని, ఆ తప్పుకి పరిహారంగా 50,000 రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించి, గడువు విధించారు.
ఈ నేపథ్యంలో ఆమె జరిమానా చెల్లించడం ఆలస్యమైంది. దీంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ చిత్రమైన తీర్పు ఇచ్చింది. జే గంట కొడుతూ.. తన భార్య తప్పు చేసిందని అరుస్తూ.. చాటింపు వేస్తూ.. రగుడిపడా పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తిరగాలని మల్లికా సాహు భర్తను ఆదేశించారు. అంతేకాదు, వెంటనే శిక్షను అమలు చేశారు. జేగంట కొడుతూ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో మల్లికా సాహూ భర్త దుష్మంత్ సాహూ తిరుగుతూ తన భార్య తప్పుచేసిందని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది తెలుసుకున్న పోలీసులు గ్రామ కమిటీపై కేసు నమోదు చేశారు.