: అధికారంలో వున్నప్పుడు లాలూ అవకతవకలు నిజమే: మీడియా ముందు సీబీఐ
తాను అధికారంలో ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ అవకతవకలకు పాల్పడ్డ మాట వాస్తవమని, అందుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని సీబీఐ ప్రకటించింది. లాలూ ఇల్లు సహా, ఆయన కుటుంబీకులకు చెందిన 12 ప్రాంతాల్లో ఈ ఉదయం సోదాలకు దిగిన సీబీఐ, ఆ వివరాలను మీడియాకు వెల్లడించింది. పలు ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా లాలూ వ్యవహరించారని, హోటళ్ల టెండర్లలో అక్రమాలు చేశారని సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా తెలిపారు.
ఓ సంస్థకు రెండు హోటళ్లను ఇచ్చినందుకు ప్రతిగా విలువైన భూమిని లంచంగా తీసుకున్నారని ఆయన తెలిపారు. మరిన్ని సోదాలు చేయాల్సి ఉందని వెల్లడించిన ఆయన, 2006లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ అవకతవకలు జరిగాయని అన్నారు. కాగా, రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే ఎన్డీయే ప్రభుత్వం సీబీఐని తనపైకి ఉసిగొల్పిందని లాలూ ఆరోపిస్తున్నారు.