: 2030 నుంచి వియత్నాం మెట్రో నగరాల్లో ఇక బైక్ లు కనపడవు!
ప్రపంచ వ్యాప్తంగా వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా నగరాల్లో బైక్ ల నుంచి వెలువడే కాలుష్యం మరీ ఎక్కువ. ఈ నేపథ్యంలో దీనిని నియంత్రించేందుకు వియత్నాం ప్రభుత్వం సరికొత్త నిబంధనకు తెరతీయనుంది. 2030 నుంచి వియత్నాంలోని మెట్రో నగరాల్లో బైక్ లను పూర్తిగా నిషేధించనున్నారు. ఈ నిర్ణయంతో ప్రజారవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ఇంకెన్నో సమస్యలు పరిష్కారమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క హెనాయ్ నగరంలోనే 7.5 మిలియన్ల మంది ప్రజలున్నారని, వీరికి 50 లక్షల బైకులు, 5 లక్షల కార్లు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. చిన్న నగరం కావడంతో లక్షలాది వాహనాలు రోడ్లపైకి రావడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని, దీంతో ట్రాఫిక్ పునరుద్ధరణ, కాలుష్య నివారణ, ప్రజారవాణాను తీర్చదిద్దడం వంటి కారణాలతో మోటారు బైకులను నిషేధిస్తున్నట్టు వియత్నాం ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా హెనాయ్ పట్టణంలో అమలు చేసి, తరువాత ఇతర నగరాలకు విస్తరించనున్నట్టు తెలిపారు.