: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ప్రకటన... వెంటనే ఖండించిన రష్యా!
భారత్–పాకిస్థాన్ మధ్య కశ్మీర్ సహా ద్వైపాక్షిక సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తెలిపినట్లు పాక్ ప్రకటించింది. చైనాలోని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో పుతిన్ కశ్మీర్ అంశంపై మాట్లాడారని, మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నారని ఘనంగా ప్రకటించింది.
అయితే, పాక్ ప్రకటనను రష్యా ఆ వెంటనే ఖండించింది. 'కశ్మీర్ అంశంపై పుతిన్ మధ్యవర్తిత్వం' అంటూ పాక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రష్యా పేర్కొంది. అస్తానాలో చర్చ సందర్భంగా కశ్మీర్ అంశం ప్రస్తావనకు కూడా రాలేదని తెలిపింది. భారత్ కోరుకుంటున్నట్టు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం కావాలని రష్యా భావిస్తోందని తెలిపారు. పాక్ విదేశాంగ శాఖ ప్రకటన అర్థరహితమని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాగా, కశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని భారత్ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే.