: మళ్లీ వివాదాస్పదమైన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీరు.. కొడుకును ముట్టుకున్నాడని తండ్రిని నిర్బంధించిన వైనం!
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తన తీరుతో ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదమైన సంస్థ తాజాగా మరోమారు అంతే వివాదాస్పదంగా ప్రవర్తించింది. హెన్రీ అమాడోర్-బ్యాటెన్ తన ఐదేళ్ల కొడుకు బెన్‌తో కలిసి ఈనెల 19న ప్యుయెర్టోరికోలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానమెక్కాడు. వారు గమ్యానికి చేరుకున్న తర్వాత విమానం నుంచి కిందికి దిగుతుంటే హెన్రీని పట్టుకుని, అధికారులు నిర్బంధించారు. ప్రయాణంలో కుమారుడిని అతడు పొదివిపట్టుకున్నాడన్నది అతడిపై మోపిన ఆరోపణ.
విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకే అతడిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అర్థంపర్థం లేని ఆరోపణలతో దాదాపు గంటపాటు హెన్రీని నిర్బంధించారు. అంతేకాదు ఓ క్రిమినల్‌ను చూసినట్టు చూశారని హెన్రీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని హెన్రీ భార్య జోయెల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీరును నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. దీంతో దిగివచ్చిన విమానయాన సంస్థ జరిగిన ఘటనపై హెన్రీకి క్షమాపణలు చెప్పింది.