: బాలికల పట్ల అత్యంత క్రూరంగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు: ఫేస్‌బుక్‌లో పోలీసులపై సంచలన పోస్టు చేసిన పోలీసధికారిణి
ఇటీవలే చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు తీసి దుశ్చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ వర్షా డొంగ్రే చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్టు కలకలం రేపింది. బస్తర్ జిల్లాలోని గిరిజన గ్రామాలు తగలబడిపోతున్నాయని ఆమె ఆరోపించింది. అక్కడి మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని, పోలీస్ స్టేషన్లలో గిరిజన యువతులపై లైంగిక దాడులు జరిగిన సంఘటనలు తనకు తెలుసని ఆమె ఫేస్‌బుక్‌లో పేర్కొనడంతో అలజడి రేగింది.
నక్సల్ సమస్యను చూపుతూ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారంటూ ఆమె పేర్కొంది. అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, నిజం నిగ్గు తేలుతుందని తాను నమ్ముతానని, నక్సల్ పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నక్సల్స్, జవాన్లు ఇద్దరూ భారతీయులేనని ఆమె చెప్పింది. వీరిలో ఎవరు ప్రాణాలు కోల్పోయినా భారత్ మొత్తం బాధపడుతుందని ఆమె పేర్కొంది.
ఆదివాసి ప్రాంతాల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను అమలు చేస్తూ... అటవీ ప్రాంతాల్లోని భూమిని సొంతం చేసుకునేందుకు అక్కడి నుంచి అడవి బిడ్డలను వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని, దీనికోసం వారికి నరకం చూపిస్తున్నారని వర్షా ఆరోపించింది. ఆదివాసి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. నక్సలిజం అంతరించిపోవాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు కానీ, పోలీసు బలగాల చేతుల్లో నలిగిపోతున్న తమ కూతుళ్లను, నాశనమవుతున్న తమ గుడిసెలను కాపాడుకోలేకపోతున్నారని ఆమె పేర్కొంది.
14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసులు బట్టలిప్పించి హింసించడం తాను కళ్లారా చూశానని ఆమె తెలిపింది. అంతేగాక మైనర్లపై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నారని తెలిపింది. ఫేస్‌బుక్‌లో ఈ పోస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత వర్షా దాన్ని తొలగించారు. అయితే, వర్షా పోస్టుపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ కేకే గుప్తా ఈ అంశంపై విచారణ చేపడుతున్నారు.