: నిర్భయ కేసులో బాలనేరస్తుడు ఎక్కడ?.. ఏం చేస్తున్నాడు?
నిర్భయ కేసులో మూడేళ్ల శిక్ష అనుభవించి తర్వాత జువెనైల్ హోం నుంచి విడుదలైన బాలనేరస్తుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?.. ఈ కేసులో నలుగురు దోషులకు హైకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ బాలనేరస్తుడు (ప్రస్తుతం అతడికి 23 ఏళ్లు) ఎక్కడున్నాడన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. అయితే, సుప్రీం తీర్పు గురించి తెలిసే అవకాశం లేని చోట అతను ఉన్నట్టు చెబుతున్నారు.
ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామానికి చెందిన అతడు చిన్నప్పుడే ఇంటిని వదిలి ఢిల్లీ వచ్చేశాడు. అనంతరం నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన బస్సులో క్లీనర్‌గా చేరాడు. నిర్భయపై జరిగిన అత్యాచారం కేసులో అతడిని దోషిగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది. బాలుడు కావడంతో జువెనైల్ హోంలో శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.
శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడి బాగోగులు చూస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ అతనిని దక్షిణాదిలో ఓ దాబాలో వంటవాడిగా కుదిర్చింది. తనకు ఉరిశిక్ష పడుతుందని అతడు రోజూ భయపడుతూ ఉండేవాడని, అందుకే అతడిని దూరంగా పంపించామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. అతడు ఎవరన్న విషయం అతడి యజమానికి కూడా తెలియదని, గతాన్ని మరచి చక్కగా పనిచేసుకుంటున్నాడని ఆయన వివరించారు. కాగా, అతడు ఎక్కడున్నాడన్న విషయం రహస్యంగా ఉన్నా, ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం అతడిపై ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం.