: మరోసారి దేశం మీసం తిప్పడానికి సిద్ధమైన ఇస్రో.. కాసేపట్లో ప్రయోగం.. లైవ్ టెలికాస్ట్‌కు నో ఛాన్స్!
భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఘన విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసుకుంది. జీశాట్-9 ఉపగ్రహ ప్రయోగానికి నిన్న కౌంట్ డౌన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కాసేపట్లో జీఎస్ఎల్వీ ద్వారా అది నింగికి దూసుకెళ్ల నుంది. అయితే, ఈ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఈసారి ఇస్రో అధికారులు మీడియాకు ప్రవేశాన్ని కల్పించలేదు. ఈ ప్రయోగానికి చెందిన లైవ్ టెలికాస్ట్ కూడా ఉండదని తెలుస్తోంది.
పాకిస్థాన్ మినహా సార్క్ దేశాలు జీశాట్-9 వల్ల లబ్ధి పొందనున్నాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, శ్రీలంక దేశాలు ఈ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ సేవలను పొందవచ్చు. నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి ప్రయోగించనున్న జిశాట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచే వీక్షించనున్నట్లు సమాచారం. అనంతరం ఆయనతో సార్క్ దేశాల అధినేతలు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.