: నా అసలు పేరుతో నన్ను ఎవరూ పిలవట్లేదు.. ‘బాహుబలి’ అంటున్నారు: బాల నటుడు నిఖిలేశ్
తనను తన పేరుతో పిలవట్లేదని..అందరూ..‘బాహుబలి’..‘బాహుబలి’ అంటున్నారని ‘బాహుబలి’ చిత్రంలో చిన్నప్పటి ప్రభాస్ పాత్ర పోషించిన బాల నటుడు దేవాదుల నిఖిలేశ్ అన్నాడు. విశాఖ పట్ణణంలో జరుగుతున్న బాలల జాతీయ చలన చిత్రోత్సవంలో నిఖిలేశ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ తో ఈ బాల నటుడు మాట్లాడుతూ, ‘నేను ఇప్పటివరకు 15 సినిమాల్లో నటించాను. ‘బాహుబలి’, ఉయ్యాల జంపాల, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, గరం...మొదలైన చిత్రాల్లో నటించాను. బాహుబలి చిత్రంతో నాకు మంచి పేరొచ్చింది. ‘బాహుబలి-2’లో కూడా చేశాను. ఈ చిత్రంలో నాకు నటించే అవకాశం ఎలా వచ్చిదంటే.. రాజమౌళి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు చేస్తున్న ‘శ్రీవల్లి’ అనే మూవీలో నేను సెలెక్టు అయ్యాను.
అయితే, ఈ చిత్రం ఆగిపోయింది. కొన్ని రోజుల తర్వాత నేను మళ్లీ ఆయన దగ్గరకు వెళ్లాను. అయితే, అప్పటికి నేను కొంచెం పెద్దవాడిని అయిపోవడంతో ఆ సినిమాలో నటించడం కుదరలేదు. అప్పుడు, విజయేంద్రప్రసాద్ గారు రాజమౌళి గారికి ఫోన్ చేయడంతో.. ‘బాహుబలి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడంతో నేను చాలా షాకింగ్ గా ఫీలయ్యాను. ఇంత పెద్ద చిత్రంలో నేను నటించింది చిన్నపాత్రలోనే అయినా, చాలా సంతోషంగా ఉంది. ‘బాబు బాగా బిజీ’, ‘అంతా నీ ఇష్టం’ అనే చిత్రాల్లో నటిస్తున్నాను. నేను హీరో అవ్వాలని అనుకుంటున్నాను..అవుతాను.. పక్కా’. నేను సినిమాల్లోకి రావడానికి మా అమ్మానాన్నలు బాగా ప్రోత్సహించారు... నేను ప్రస్తుతం ఇంటర్ ఫస్టు ఇయర్ చదువుతున్నాను. సినిమా, చదువు రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను. సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం’ అని నిఖిలేశ్ చెప్పుకొచ్చాడు.