: కవిత గారూ... అనడానికి ఇబ్బందిగా ఉంది!: కేటీఆర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరుగుతున్న జనహిత ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీలను పేరు పేరునా పలకరిస్తూ, ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, "కవితను కవితగారు, ఎంపీగారు అనడానికి నాకు మనసొప్పుట లేదు. ఎందుకంటే, చిన్నప్పటి నుంచి కవిత అని పిలిచి, ఇప్పుడు సడన్ గా, ఎంపీగారు, గౌరవనీయులు అని సంబోధించాలంటే, కొంత ఇబ్బందిగా ఉంది" అంటూ సభలో నవ్వులు పూయించారు.
మొట్టమొదటి సారిగా ఇద్దరమూ ఒకే వేదికను పంచుకున్నామని, ఈ సందర్భంగా ఆమెకు ఓ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఆపై మాట్లాడుతూ, ఇటీవల ఓ పెద్దాయన తనతో మాట్లాడుతూ, ప్రస్తుతం పార్లమెంటులో అద్భుతంగా ప్రసంగిస్తారని పేరున్న టాప్ 5లో కవిత కూడా ఒకరని చెప్పారని, తన బిడ్డలను నాయకులుగా తయారు చేసిన మీ తండ్రిగారిని మెచ్చుకుంటున్నానని ఆయన అన్నారని, ఆ మాటలు విని తనకెంతో ఆనందం కలిగిందని కేటీఆర్ చెప్పారు.