: పది సెకన్ల యాడ్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న సంస్థలు.. ఆరంభానికి ముందే ఐపీఎల్ రికార్డులు!


ప్రారంభానికి ముందే ఐపీఎల్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న అత్యంత ఖరీదైన లీగ్‌లలో ఒకటిగా నిలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో యాడ్స్ కోసం స్పాన్సర్లు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. మ్యాచ్ మధ్యలో ప్రకటనల కోసం నిర్దేశించిన సమయాన్ని (స్లాట్లు) ప్రముఖ సంస్థలన్నీ ఇప్పటికే బుక్ చేసుకున్నాయి. ఇక ఐపీఎల్ తొలి సీజన్ నుంచి మ్యాచ్‌లను ప్రముఖ టీవీ చానెల్‌ సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

ప్రకటనల కోసం పలు కంపెనీలు ఐపీఎల్ ప్రారంభానికి ముందే పోటెత్తుతుండడంతో సోనీ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. ప్రకటన ఆదాయాన్ని తొలుత రూ.1300 కోట్లుగా నిర్దేశించుకున్న సోనీ.. సంస్థల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఆ లక్ష్యాన్ని ఎప్పుడో దాటేసింది. ప్రస్తుత సీజన్ తమకు అత్యుత్తమ సంవత్సరంగా నిలుస్తుందని, ఈసారి ఎక్కువమంది స్పాన్సర్లను పొందగలిగామని సోనీ  నెట్‌వర్క్స్‌ సేల్స్‌ ప్రెసిడెంట్‌ రోహిత్‌ గుప్తా వెల్లడించారు.

ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌లో ప్రకటనల కోసం మొత్తం  2,300 సెకన్లను కేటాయించగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో అత్యధికంగా 300 సెకన్లు దక్కించుకుంది. ఇందులో భాగంగా ప్రతి పదిసెకన్ల యాడ్ కోసం రూ.5.2 లక్షలు చెల్లించనుంది. ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వేర్వేరుగా 210 సెకన్లు దక్కించుకోగా ఈ రెండు సంస్థలు ప్రతి 10 సెకన్ల ప్రకటనకు రూ.5.2 లక్షలు చెల్లించనున్నాయి. ఇక విమల్ పాన్ మసాలా, యమహా మోటార్స్, సియట్ టైర్స్, పార్లే, ఎస్ బ్యాంక్, వోల్టాస్, పాలీ క్యాబ్, మేక్ మై ట్రిప్, హావెల్స్, పార్లే బిస్కెట్స్, మారుతీ  సుజుకీలు అసోసియేట్ స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. ఇవి ప్రతి పది సెకన్ల యాడ్‌కు రూ.5.75 లక్షలు చెల్లించనున్నాయి.  

  • Loading...

More Telugu News