: శశికళ, ఆమె భర్త నటరాజన్ ల మధ్య బంధంపై దినకరన్ సంచలన వ్యాఖ్యలు
అన్నాడీఎంకే పార్టీలో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి స్థానం లేదని ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ బంధువు దినకరన్ తెలిపారు. 1990 నుంచే శశికళతో ఆమె భర్త నటరాజన్ కు సంబంధాలు లేవని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. జయ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లిపోతోందంటూ పన్నీర్ సెల్వంతో పాటు, పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, దినకరన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
1990 తర్వాత ఇంత వరకు పోయెస్ గార్డెన్ లోని జయ నివాసంలోకి నటరాజన్ అడుగు కూడా పెట్టలేదని దినకరన్ తెలిపారు. శశికళ కూడా నటరాజన్ తో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని అన్నారు. పార్టీలో తమ కుటుంబ సభ్యులెవరికీ స్థానం లేదని... కొత్తగా మరెవరినీ చేర్చుకోబోమని కూడా చెప్పారు. శశికళ జైలుకు వెళుతున్న సందర్భంలో, ఆమె బంధువైన దినకరన్ ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే.