: ఆర్కే నగర్ నుంచి పోటీకి సిద్ధం!: దీప ప్రకటన
తమిళనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సొంత నియోజకవర్గమైన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలకు నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉపఎన్నికలు జరగనుండగా, ఈనెల 23 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో తాను పోటీ చేస్తానని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ప్రకటించారు.
జయలలిత మరణం అనంతరం దీపకు మద్దతిస్తామని, శశికళకు మద్దతివ్వమని ఆర్కే నగర్ వాసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తమకే ప్రజల మద్దతు ఉందని నిరూపించుకోవాలని శశికళ వర్గం ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. పన్నీరు సెల్వం వర్గం కూడా విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ వర్గం దీపకు మద్దతిస్తుందేమో చూడాలి. మరోవైపు డీఎంకే కూడా విజయం కోసం బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉపఎన్నిక అక్కడ పోటీకి దిగనున్న అందరికీ ప్రతిష్ఠాత్మకంగా మారింది.