: వచ్చే ఏడాది నాగచైతన్యతో నటించే ఛాన్స్ ఉంది: సమంత
సినీనటులు అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లి మరికొన్ని నెలల్లో జరపాలని వారి పెద్దలు భావిస్తుండడంతో సమంత మళ్లీ సినిమాల్లో ఎప్పటిలాగే కనిపిస్తుందా? అని ఆ అమ్మడి అభిమానుల్లో చర్చ కొనసాగుతోంది. వీటన్నింటికీ సమంత సోషల్ మీడియాలో సమాధానాలిచ్చింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో సరదాగా ముచ్చటించింది. ఈ ఏడాది తనను తెరపై చూడవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది తాను నాగచైతన్యతో నటించే ఛాన్స్ కూడా ఉందని తెలిపింది. ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా తన కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన చిత్రమని చెప్పింది. ఆ చిత్రం సరిగా ఆడకపోవడంతో నిరుత్సాహపడ్డానని, అయితే ఆ చిత్రానికి నంది పురస్కారం లభించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపింది.
తనను ఎక్కువగా భయపెట్టే విషయం పరాజయమేనని సమంత చెప్పింది. పెద్ద విజయాల కోసం సిద్ధమవుతూనే వచ్చిన విజయాల్ని సెలబ్రేట్ చేసుకొంటానని తెలిపింది. ఈ ఏడాది తనకు చాలా ప్రత్యేకమైందని, అదెందుకనేది ప్రేక్షకులకు త్వరలోనే తెలుస్తుందని పేర్కొంది. ఇంటికి మించిన ఇష్టమైన ప్రదేశం తనకు మరొకటి లేదని చెప్పింది. తనకు ఆటల్లో క్రికెట్ అంటే ఇష్టమని తెలిపింది.