: దుమారం రేపిన బీహార్ మంత్రి వ్యాఖ్యలు.. మోదీ చిత్రపటాన్నిబూట్లతో కొట్టాలంటూ పిలుపు
ప్రధాని నరేంద్రమోదీపై బీహార్ ఎక్సైజ్‌శాఖ మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించినా, కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసినా బీజేపీ సభ్యులు శాంతించడం లేదు. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దేశద్రోహం కేసు పెట్టాలంటూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం పూర్ణియా జిల్లాలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్‌కు చెందిన మంత్రి మాట్లాడుతూ 50 రోజులు గడిచినా నోట్ల రద్దు కష్టాలు తీరలేదని, ఇందుకు శిక్షగా మోదీని బూట్లతో కొట్టాలంటూ పిలుపునిచ్చారు. దీంతో రెచ్చిపోయిన కొందరు కార్యకర్తలు వెంటనే స్టేజిపైకి చేరుకుని అక్కడున్న మోదీ చిత్రపటాన్ని బూట్లతో కొట్టారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ సభ్యులు మంత్రి తీరుపై మండిపడ్డారు. అతడిని మంత్రవర్గం నుంచి తప్పించాల్సిందేనని అసెంబ్లీలో పట్టుబట్టారు. దేశ ప్రధానిని అలా అగౌరవపరిచే హక్కు ఆ మంత్రికి రాజ్యాంగం కల్పించలేదని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ పేర్కొన్నారు. ఇక ఎంతమాత్రమూ పదవిలో ఉండే అర్హత మంత్రికి లేదని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చౌదరి ఖండించారు. పార్టీ ఇటువంటి చర్యలను ఎంతమాత్రమూ సమర్థించదని స్పష్టం చేశారు. వారి వివరణతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు మంత్రిని బర్తరఫ్ చెయ్యాల్సిందేనంటూ సభలో పట్టుబట్టడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.