: నాసికరం అన్నం పెడుతున్నారంటూ.. ఆందోళనకు దిగిన చర్లపల్లి జైలు ఖైదీలు!
హైదరాబాదులోని చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు ఆందోళనకు దిగారు. తమకు నాణ్యత లేని, నాసికరం ఆహారాన్ని అందిస్తున్నారని... రేషన్ లో కోత విధిస్తున్నారని వారు ఆరోపించారు. తమ నోట్లో మట్టి కొట్టి, జైలు అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. జైలు సూపరింటెండెంట్ గా చింతల దశరథం బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి డ్యూటీ విషయంలో వార్డర్లకు కూడా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఆహారం విషయంలో ఖైదీలు నిత్యం ఘర్షణ పడాల్సి వస్తోందని వాపోయారు. డీజీ వినయ్ కుమార్ పేరును వాడుకుంటూ సూపరింటెండెంట్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఉదయం అల్పాహారాన్ని నిరాకరించిన ఖైదీలు తన నిరసనను వ్యక్తం చేశారు.